రాజ్యాంగ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలి
సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవరావు
హుస్నాబాద్ ÷ విద్యార్థులు రాజ్యాంగ విలువలను అలవర్చుకోవాలని సిద్ధిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవరావు పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన గల డ్రాప్టింగ్ కమిటీ దేశ ప్రజలందరి సమాన హక్కుల కోసం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిందని కొనియాడారు. విద్యార్థులు తమ ప్రాథమిక హక్కుల తో పాటు ప్రాథమిక విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ స్థాయి నుండి విద్యార్థులు రాజ్యాంగ విలువలను అవగాహన చేసుకున్నట్లయితే, దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటట్లు నాయకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి ఆయన రాజ్యాంగ పీఠిక పఠనం చేసి దేశ సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం అధ్యాపకులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రానున్న వార్షిక పరీక్షల కోసం 45 రోజుల ప్రణాళికను అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. విద్యార్థుల ముఖ హాజరు మరింత పెరుగుపరచాలని సూచించారు. ఈ సంవత్సరం వార్షిక ఫలితాలలో సిద్ధిపేట జిల్లాను మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేయాలని ఆయన సూచించారు. తరగతి గదులను కూడా ప్రత్యేకంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మంచి ఫలితాలు సాధించుటకు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. గంగాధర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి రణధీర్ కుమార్, అధ్యాపకులు వి రజనీ, ఎస్ సత్యనారాయణ,వి సదాశివ్,బి ఎల్లయ్య,ఎస్ వెంకట ముత్యం, బి వాల్య, సిహెచ్ విద్యాసాగర్, పి చంద్రమోహన్, సిహెచ్ రాజిరెడ్డి, ఎస్ అశోక్, గ్రంథ పాలకురాలు ఆర్ వాసవి, ఏ మమత, ఆర్ వెంకటేష్ అధ్యాపకేతర సిబ్బంది వెంకట సాయి, శ్వేత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

