అసలు సూత్రధారులను వదిలేస్తారా?
చిన్న ఉద్యోగలపై కేసులా నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఆగ్రహం
బెల్లంపల్లి( మంచిర్యాల జిల్లా) : నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో అసలు సూత్రధారులను వదిలేసి చిన్న స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈ అక్రమాల వెనుక ఉన్న కాంగ్రెస్ నాయకులను అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరెస్టయిన వ్యక్తులు నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం వెనుక ఉన్న ముఠా వివరాలను వెల్లడిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో భూకబ్జాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రస్తుత ప్రభుత్వం మరో రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నకిలీ డెత్ సర్టిఫికెట్ల వెనుక ఉన్న అసలు ముఠాను గుర్తించి, సమగ్ర విచారణతో బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ లను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

