రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా): బాలల హక్కుల ప్రజా వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లిలో విలేకరులకు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల వయసు వరకు ఉన్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 34 రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దేశభక్తి గీతాలు, భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, జానపద గీతాలు, గిటార్, కీబోర్డు, ఫ్లూటు, తబలా, మిమిక్రీ, మ్యాజిక్, చిత్రలేఖనం, కార్టూన్లు, కవిత్వం, యోగా, పర్వతారోహణ, సైక్లింగ్, స్కేటింగ్, ఈత, చెస్, కరాటే, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, రన్నింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఆర్చరీ, కోలాటం, బతుకమ్మ, జాతీయ సమైక్యత శిబిరం తదితర రంగాల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులు అర్హులని వివరించారు.
నవంబర్ 5 వరకు దరఖాస్తులు
ఆసక్తి, ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ నైపుణ్యాలకు సంబంధించిన మెరిట్ సర్టిఫికెట్లు, పత్రికా ప్రచురణలు (ప్రెస్ క్లిప్పింగ్స్), బయోడేటా, దరఖాస్తుదారుడి ఫొటోను జతచేసి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలని సుభాష్ చంద్రబోస్ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: వలస సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర అధ్యక్షుడు, బాలల హక్కుల ప్రజా వేదిక, ఇంటి నంబర్ 2-92, కూరెల్ల గ్రామం, కోహెడ మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం–505473.
ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

