క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.
నాంపల్లి ప్రీమియర్ లీగ్ విజేతగా పులికుంట్ల పీవి యువసేన జట్టు.
ద్వితీయ విజేతగా దేవత్ పల్లి గ్రీన్ ఆర్మీ జట్టు.
ప్రధమ బహుమతిగా రూ. 80వేలు ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు అందజేత.
నాంపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో ఐపీఎల్ తరహాలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో ఏడు క్రికెట్ జట్లు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నాయి. క్రీడాకారులు పోటాపోటీగా తలపడటంతో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని గెలుచుకున్న పులికుంట్ల పీవీ యువసేన కెప్టెన్ పిల్లి సిద్దు యాదవ్ జట్టుకు నగదు రూ. 80,000 బహుమతితో పాటు షీల్డ్‌ను అందజేశారు. అదేవిధంగా ద్వితీయ బహుమతిని సాధించిన దేవత్‌పల్లికి చెందిన గ్రీన్ ఆర్మీ కెప్టెన్ ప్రవీణ్ జట్టుకు రూ.50,000 నగదు బహుమతిని అందజేసి అభినందించారు. విజేత జట్లకు బహుమతులు అందజేయడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది. యువత క్రీడల్లో రాణించాలి.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే తత్వాన్ని అలవర్చుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని తెలిపారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో ఐక్యతను పెంపొందించడంతో పాటు స్నేహభావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టోర్నమెంట్ విజయవంతంగా ముగియడంతో నిర్వాహకులు, క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని,భవిష్యత్తులోనూ ఇలాంటి పోటీలను నిర్వహించి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో నాంపల్లి పట్టణ సర్పంచ్ నక్క చంద్రశేఖర్,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహ రావు, నాయకులు వెంకట్ రెడ్డి,సపావత్ సర్దార్ నాయక్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

