‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!
తాడిచర్ల ఓసీపీ నిర్వాసితుల ఆగ్రహం.. పనులను అడ్డుకున్న బాధితులు 2,265 ఇళ్ల నుంచి 847 కుటుంబాలకే అర్హత.. జాబితా సవరించాలని డిమాండ్
మల్హర్ : తాడిచర్ల ఓసీపీ పనులకు అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తామని, చంపిన తర్వాత నష్టపరిహారం ఇస్తామని జెన్‌కో అధికారులు బెదిరించినట్లు నిర్వాసితులు ఆరోపించారు. తప్పుల తడకగా రూపొందించిన ఆర్‌అండ్‌ఆర్ జాబితాను సవరించి స్థానిక గృహాలన్నింటినీ చేర్చే వరకు పనులు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. గురువారం భారీ యంత్రాలతో పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు. 2,265 ఇళ్ల నుంచి 847 కుటుంబాలకే అర్హత తాడిచర్ల ఓసీపీ 500 మీటర్ల డేంజర్ జోన్ పరిధిలో గృహాల సేకరణకు 2022 డిసెంబరులో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత 2,265 గృహాలను గుర్తించిన అధికారులు, అనంతరం సామాజిక-ఆర్థిక సర్వే తర్వాత ఆర్‌అండ్‌ఆర్ అర్హుల సంఖ్యను 847 కుటుంబాలకు పరిమితం చేశారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది స్థానిక గృహాలను జాబితా నుంచి తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. డిక్లరేషన్‌లో అన్ని ఇళ్లను చేర్చాలి ఈ నెల 23న నిర్వహించిన గ్రామసభలో తప్పిపోయిన గృహాలపై ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని బాధితులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తికాకముందే పనులు చేపట్టేందుకు రావడంతో అడ్డుకున్నామని పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో అన్ని ఇళ్లను చేర్చి పరిహారం అందించాలని, కటాఫ్ తేదీని 2026 మార్చి వరకు పొడిగించాలని, 2019కు ముందు వివాహమైన ఆడపిల్లలను అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పునరావాస కాలనీలో మౌలిక వసతులతో ప్లాట్లు ఇవ్వాలని లేదా రెండు గుంటలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పనులు సాగనివ్వబోమని నిర్వాసితులు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

