ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఘన నివాళులు రాజ్యాంగ హక్కులతో పాటు పౌర బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావమే రాజ్యాంగ స్ఫూర్తి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాల, మహార్, నేతకాని అనుబంధ కులాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ విశిష్టతను, ప్రజాస్వామ్య విలువలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాల్లో ఒకటని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించేలా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం పునాదిగా నిలుస్తోందన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు, అందులో పొందుపరిచిన ప్రాథమిక విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజ్యాంగ ఆశయాలు, విలువలను ఆకళింపు చేసుకుని సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం వంటి సూత్రాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిందన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టాలు, నియమాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, సామాజిక సమానత్వం, సోదరభావం పెంపొందించడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా సమానత్వ భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత రాజ్యాంగ విలువలను తెలుసుకుని, చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం పరిఢవిల్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ, పౌరులుగా తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా యువత అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని, రాజ్యాంగ విలువలను అనుసరిస్తూ విద్య, సామాజిక చైతన్యం ద్వారా సమాజ అభ్యున్నతికి పాటుపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల అధికారులు, మాల, మహార్, నేతకాని కులాల జేఏసీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


