రెండేళ్లయినా కదలని రోడ్డు! ఆగిపోయిన వంతెన! కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా? - ప్రశ్నిస్తున్న గ్రామస్తులు*
ములుగు మండలంలోని దేవగిరి పట్నం, పత్తిపల్లి, అన్నంపల్లి గ్రామాల ప్రజలకు రోడ్డు అంటేనే భయం పుట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోడ్డు పనులు మొదలై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. దేవగిరి పట్నం - పత్తిపల్లి మధ్య సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ కేవలం కంకర మెటీరియల్ వేసి అలాగే వదిలేశారు. తారు వేయలేదు, మరమ్మత్తు చేయలేదు. రెండేళ్లుగా ఆ కంకర రోడ్డుపైనే ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఉదయం లేస్తే పిల్లలు స్కూల్‌కు వెళ్లాలి. రైతులు పొలాలకు వెళ్లాలి. కూలీలు పనులకు వెళ్లాలి. రోగులు ఆస్పత్రికి వెళ్లాలి. కానీ అందరికీ ఈ 3 కి.మీ రోడ్డే దిక్కు. ఈ రోడ్డుపై వెళ్తుంటే రాళ్లు ఎగిరిపడుతున్నాయి. దుమ్ము కమ్ముకుంటోంది. బైక్‌పై వెళ్లే వారు జారిపడి గాయాలపాలవుతున్నారు. ఆటోలు, కార్లు నడపాలంటేనే డ్రైవర్లు భయపడుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు. వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణం. కంకర కొట్టుకుపోయి వాహనాలు కదలలేని స్థితి ఏర్పడుతోంది. "రోడ్డు వేస్తామని చెప్పి రెండేళ్లు అయింది. ఇప్పటివరకు కంకర తప్ప తారు చూడలేదు. మా గోస ఎవరికి పట్టదా?" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడి వాగుపై ఆగిపోయిన వంతెన ఇదొక్కటే కాదు. అన్నంపల్లి - దేవగిరి పట్నం మధ్య గల మేడి వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. నిర్లక్ష్య సమాధానంతో కాంట్రాక్టర్. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని గ్రామస్తులు కాంట్రాక్టర్‌ను అడిగితే నిర్లక్ష్య సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. "ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో ఇంత నిర్లక్ష్యమా? అడిగిన వారిని బెదిరించడమా?" అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని, కనీసం వచ్చి చూడటం కూడా లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని, స్థానిక మంత్రి సీతక్క చొరవ తీసుకొని మేడి వాగుపై వంతెన, దేవగిరి పట్నం - పత్తిపల్లి మధ్య రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

