ఓటు హక్కును కాలరాస్తున్న ఎస్‌ఐఆర్ విధానాన్ని రద్దు చేయాలి : పసులేటి వెంకటేష్
.jpeg)
* ప్రజా ఆందోళనపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమే
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : రాజ్యాంగ హక్కులను కాలరాయడం ప్రధాని మోదీకే చెల్లిందని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు. ఓటు హక్కును ప్రభావితం చేస్తున్న ఎస్‌ఐఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దీనికి బాధ్యులైన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆందోళన మార్చ్‌లో పాల్గొనేందుకు వస్తున్న వారిపై ముందస్తు నిర్బంధాలు, పోలీసు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. రైలు సర్వీసుల రద్దు, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, బారికేడ్ల ఏర్పాటు వంటి చర్యలతో ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ ఆంక్షల వల్ల రైతులు, కార్మికులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు, వైద్య చికిత్స కోసం ప్రయాణించే రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కులను రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. శాంతియుత ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం కాకుండా ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నిస్తే ప్రజా పోరాటాలు మరింత ఉధృతమవుతాయని పసులేటి వెంకటేష్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


