క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

*వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10 కోట్లకు పైగా మోసం చేసిన నిందితులు. 

క్రిప్టో కరెన్సీ తో అధిక లాభాలు ఇస్తామని చెప్పే వ్యక్తులు, సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

*ఐటీసీ గ్లోబల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని మోసం

*పోంజీ స్కీమ్, మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా వందలాది మందికి టోకరా

*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 500 మంది బాధితులు.. కోట్లలో మోసం జరిగినట్లు అనుమానం

*ఆదిలాబాద్ వన్ టౌన్ పరిధిలో 3 నుంచి సుమారు రూ.21 లక్షలు వసూలు

*జూమ్ మీటింగ్‌లు, హోటళ్లలో సమావేశాలతో ప్రజలకు వల
*ఆరుగురిపై కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్, ఆస్తులు, సెల్‌ఫోన్లు స్వాధీనం
*వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ  WhatsApp Image 2026-10-11 at 4.55.46 AM

ఆదిలాబాద్ బ్యూరో  : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని, రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని నమ్మించి ప్రజలను మోసం చేసిన ఐటీసీ గ్లోబల్ సంస్థకు చెందిన ఇద్దరు నిందితులను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  తెలిపారు. ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. కేసు వివరాలను పరిశీలించినట్లయితే తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు జువ్వక నర్సింలును ఐటీసీ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు సంప్రదించి, పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, పెట్టుబడి రెట్టింపు అవుతుందని, ఎక్స్ 4+4 రాబడులు కూడా పొందవచ్చని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి మాటలు నమ్మిన నర్సింలు 2023లో ఐ టీ సీ 58708 ఐడీ ద్వారా రూ.7,50,000 పెట్టుబడిగా పెట్టారు. అయితే పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా నిందితులు చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 17/2026, సెక్షన్లు 420, 409 ఐపీసీ, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) చట్టంలోని సెక్షన్లు 3, 4 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మోసం చేసిన విధానం :

నిందితులు సిటీ. క్లబ్. ఓటిస్ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి, ఐటీసీ క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడుల పథకాన్ని నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.1,000 నుంచి రూ.3 లక్షల వరకు వివిధ ప్యాకేజీలను ప్రవేశపెట్టి, పెట్టుబడి పెట్టిన మొత్తం రెండేళ్లలో రెట్టింపు అవుతుందని ప్రజలను నమ్మించారు. ఈ పథకంలో నాన్ వర్కింగ్ ప్లాన్, వర్కింగ్ ప్లాన్ పేరుతో రెండు విధానాలను ప్రవేశపెట్టారు. నాన్ వర్కింగ్ ప్లాన్‌లో రెండేళ్లకు పెట్టుబడి రెట్టింపు అవుతుందని, వర్కింగ్ ప్లాన్‌లో కొత్త సభ్యులను చేర్చితే వారి పెట్టుబడులపై 25 శాతం వరకు కమీషన్ లభిస్తుందని ఆశ చూపినట్లు గుర్తించారు. ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో మరింత మందిని సభ్యులుగా చేర్చుకునేలా ప్రోత్సహించి, వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలలో సమావేశాలు నిర్వహించడంతో పాటు జూమ్ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పథకం గురించి వివరించారు. డైరీలు, క్యాలెండర్లు పంపిణీ చేస్తూ తమ సంస్థపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారితో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించి, ఆన్‌లైన్ ఎక్స్ఛేంజ్‌లు లేదా గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా డబ్బులు పంపించాలని సూచించారు. డబ్బులు చెల్లించిన వారికి వారి ఐడీలలో ఐటీసీ క్రిప్టో కరెన్సీ జమ చేసినట్లు చూపించేవారు.

కొత్త క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లపై విచారణ :

ప్రస్తుతం యుఎస్- డి ఎక్స్, దీక్ష పేర్లతో ఉన్న క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారనే సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, నిందితులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఆదిలాబాద్‌లో ఐదుగురికి రూ.21 లక్షల నష్టం వాటిల్లునట్లు వెల్లడయింది. 2023లో నిందితులు తమ ఏజెంట్ల ద్వారా ఆదిలాబాద్‌కు వచ్చి ద్వారక హోటల్‌లో సమావేశాలు నిర్వహించి, ఐటీసీ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఫిర్యాదుల ప్రకారం బాధితులు పెట్టుబడిగా చెల్లించిన వివరాల ప్రకారం - జువ్వక నర్సింలు – రూ.7.50 లక్షలు, - చిక్కి గంగాధర్ – రూ.7.50 లక్షలు, - అడ్డీ కాంతారెడ్డి – రూ.6.21 లక్షలు. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఐదుగురు బాధితులు సుమారు రూ.30 లక్షలు నష్టపోయినట్లు గుర్తించారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ను మూసివేసి, పెట్టుబడులు తిరిగి చెల్లించకుండా నిందితులు కాలయాపన చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ, మరికొన్ని రోజుల్లో చెల్లిస్తామని చెబుతూ తప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిందితుల వివరాలు :

ఏ 1. పొలమారశెట్టి రత్నరాజు (47), తండ్రి ప్రకాష్ రావు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – ఐటీసీ గ్లోబల్ వ్యవస్థాపకుడు. (అరెస్ట్), ఏ 2. దొండపాటి లక్ష్మణరావు @ లాజరస్ (46), తండ్రి సోమరాజు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ – ఐటీసీ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు. (అరెస్ట్), ఏ 3. గోపికృష్ణ – సంస్థ ప్రతినిధి., ఏ 4. అజీమ్ ఖాన్ – సంస్థ ప్రతినిధి.,  ఏ 5. గాజుల ప్రమోద్ కుమార్ – ఏజెంట్, వరంగల్. ఏ6. వేమునూరి సుధీర్ – ఏజెంట్, వరంగల్.,.. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులకు సంబంధించిన జహీరాబాద్ మరియు రాజమండ్రి కి సంబంధించిన ఆస్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ మిగిలిన నిందితుల పాత్ర, ఇతర బాధితుల వివరాలు, మోసానికి గురైన మొత్తం నగదు వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలకు ఎస్పీ సూచనలు :

క్రిప్టో కరెన్సీ పేరుతో తక్కువ సమయంలో పెట్టుబడులు రెట్టింపు చేస్తామని, అధిక లాభాలు ఇస్తామని చెప్పే వ్యక్తులు, సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  సూచించారు. ఆన్‌లైన్ ప్రచారాలు, జూమ్ మీటింగ్‌లు, ఏజెంట్ల మాటలు నమ్మి కష్టార్జిత డబ్బులను పెట్టుబడిగా పెట్టవద్దని తెలిపారు. ఏదైనా పెట్టుబడి పథకంలో చేరే ముందు ఆ సంస్థ విశ్వసనీయత, చట్టబద్ధతను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. ఇలాంటి మోసాలకు గురైనవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్‌ఐలు అశోక్, సంజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

 

Views: 91

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..