సుద్దులం సర్పంచ్ భర్తపై కేసు నమోదు..!
పని మానేస్తానన్నందుకే దాడి చేశాడని బాధితుడి ఆరోపణ..!

- చిన్న రెడ్డి తలపై కుర్చీతో దాడి.. తీవ్ర రక్తస్రావం
- ఊరు దాటితే చంపేస్తానని బెదిరించాడని బాధితుడి ఆవేదన
నిజామాబాద్ : వ్యవసాయ పనులు మానేస్తానని చెప్పినందుకు చిన్న రెడ్డి పై సుద్దులం సర్పంచ్ భర్త తీనేటి లక్ష్మణ్‌రెడ్డి కుర్చీతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైందని, మోకాళ్లపై కూడా దాడి చేయడంతో వాపు వచ్చిందని బాధితుడు చిన్నారెడ్డి డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సుద్దులం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
పని మానేస్తానన్నందుకే దాడి...
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా మండలం కాంబోలు గ్రామానికి చెందిన చిన్నారెడ్డి నాలుగు నెలల క్రితం సుద్దులం గ్రామానికి చెందిన తీనేటి లక్ష్మణ్‌రెడ్డి వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు కుదిరాడు. అయితే కొంతకాలంగా తనకు సరిగా భోజనం పెట్టడం లేదని, ఇకపై వ్యవసాయ పనులు చేయలేనని చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీంతో లక్ష్మణ్‌రెడ్డి తన నివాసానికి పిలిపించి చంపేస్తానని బెదిరించండని తెలిపాడు.
కుర్చీతో తలపై దాడి.. రక్తస్రావం
పని ఎందుకు మానేస్తున్నావంటూ దూషిస్తూ, సుద్దులం గ్రామం దాటి వెళ్తే చంపేస్తానని బెదిరించాడని చిన్నారెడ్డి ఆరోపించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కుర్చీని తీసుకుని తన తల కుడివైపు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైందని, మోకాళ్లపై కూడా కొట్టడంతో వాపు వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తలకు గాయమై రక్తం కారుతున్న సమయంలో లక్ష్మణ్‌రెడ్డి తల్లి, అక్క, భార్య కలిసి రక్తాన్ని శుభ్రం చేశారని బాధితుడు ఆరోపించాడు. అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వెంకటేశ్ తనకు సహాయం చేయలేదని వాపోయాడు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం నిజామాబాద్ లోని గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకున్నానని తన తలకు గాయం కలిగి రక్తస్రావం జరగడంతో అక్కడి వైద్యులు చికిత్స చేసి గాయానికి మూడు స్టిచ్చేస్ (కుట్లు) వేశారని ఆయన తెలిపారు.
పోలీసుల వద్దకు వెళ్లకుండా బెదిరింపులు?
దాడి అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఊరు దాటితే చంపేస్తానని లక్ష్మణ్‌రెడ్డి బెదిరించినట్లు చిన్నారెడ్డి ఆరోపించాడు. భయంతో గ్రామం నుంచి బయటకు వచ్చి, మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి వాహనంపై లిఫ్ట్ తీసుకుని డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నానని తెలిపాడు. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.
ప్రాణభయం ఉందంటున్న బాధితుడు
ప్రస్తుతం తల తిరుగుతోందని, ఆరోగ్యం బాగాలేదని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపాడు. ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం స్థానికంగా చర్చకు దారితీసింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


