కోనాయపల్లిలో దళితులపై దాడి ఘటనపై అధికారుల విచారణ
సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలి.. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి
* నవంబర్ 5న కోనాయపల్లి నుంచి తుప్రాన్ డీఎస్పీ కార్యాలయం వరకు పాదయాత్ర
మనోహరాబాద్ : కోనాయపల్లి గ్రామంలో అక్టోబర్ 18న దళితులపై జరిగిన దాడి ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తుప్రాన్ డీఎల్పీఓ సాయిబాబా సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు తమపై జరిగిన దాడి వివరాలను అధికారికి వివరించారు.దాడికి పాల్పడిన గ్రామ సర్పంచ్ మన్నె కళ్యాణ్‌ను పదవి నుంచి తొలగించాలని బాధితులు డిమాండ్ చేశారు. దళితులపై దాడికి పాల్పడిన వ్యక్తి సర్పంచ్ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. దాడికి గురైన పంచాయతీ కార్మికులను పంచాయతీ కార్యదర్శి పరామర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు.జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ప్రకారం దళితులపై దాడి జరిగినప్పుడు సంబంధిత అధికారులు దళితవాడను సందర్శించి బాధితులకు అండగా నిలవాల్సి ఉంటుందని, అయితే కోనాయపల్లి పంచాయతీ కార్యదర్శి ఇప్పటివరకు దళితవాడను సందర్శించలేదని ఆరోపించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం విధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని విచారణ అధికారిని కోరారు.
*నవంబర్ 5న డీఎస్పీ కార్యాలయానికి పాదయాత్ర"
కోనాయపల్లిలో దళితులపై దాడికి పాల్పడిన సర్పంచ్ మన్నె కళ్యాణ్‌ను నవంబర్ 4వ తేదీలోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న కోనాయపల్లి నుంచి తుప్రాన్ డీఎస్పీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య, జిల్లా కార్యదర్శి నిరంజన్ దాసు, డీబీఎఫ్ తుప్రాన్ డివిజన్ అధ్యక్షుడు పంచమి చంద్రం, బాధితులు నర్సిములు, ప్రవీణ్, గురుదాస్, శ్రావణి, అర్జున్, మల్లేష్, అండాలు, ఎల్లమ్మ, బిక్షపతి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


