పీఎఫ్ఎంఎస్ విధానానికి స్వస్తి.. స్కూళ్లలో హెచ్ఎంలకు కొత్త తిప్పలు
నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసే గ్రాంట్ల వినియోగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు ప్రధానోపాధ్యాయులకు కొత్త తలనొప్పిగా మారాయి. పాఠశాలల నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలొస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో 1,020 స్కూల్ ఉన్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలో648, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 125, ఉన్నత పాఠశాలలు 191 ఉన్నాయి. అలాగే 56 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1,121 పాఠశాలలు ఉండగా అందులో 256 ఉన్నత పాఠశాలలు, 127 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, 738 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
చేయని ఖర్చులకు ముందస్తు బిల్లులా?
ముఖ్యంగా ఇంకా కొనుగోలు చేయని వస్తువులకు, ప్రారంభించని పనులకు ముందుగానే బిల్లులు సమర్పించాలనే నిబంధనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం ఎలా అమలు చేయాలో స్పష్టత లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, పాఠశాల స్థాయిని ప్రాతిపదికగా తీసుకుని సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఏటా రూ.10 వేల నుంచి రూ.4 లక్షల వరకు వివిధ కేటగిరీల్లో గ్రాంట్లు మంజూరు చేస్తారు.
పాఠశాల నిర్వహణకు ఈ నిధులు..
ఈ నిధులను పాఠశాలల రోజువారీ నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది. సుద్దముక్కలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు, చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు, తాగునీటి సరఫరా, లైబ్రరీ నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ తదితర అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. అయితే పాఠశాలల కనీస అవసరాల కోసం కేటాయించిన నిధులను వినియోగించుకోవడంలోనూ రోజుకో నిబంధన ఎదురవుతుండటంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
జాయింట్ ఖాతాల నుంచి వెండర్ల ఖాతాలకు..
గతంలో పాఠశాలలకు మంజూరైన గ్రాంట్లు హెచ్ఎం, పాఠశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ సంయుక్త బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. అనంతరం ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రికార్డులను సమర్పించే విధానం ఉండేది. ఆ తర్వాత నిధుల చెల్లింపుల కోసం పీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా ఈ విధానంలోనూ మార్పులు చేస్తూ, వెండర్ల వివరాలను ముందుగానే నమోదు చేసి వారి బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వ్యాపారుల ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర సమాచారాన్ని సేకరించి పోర్టల్లో నమోదు చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు భారంగా మారుతోంది.
జరగని ఖర్చులకు ముందే బిల్లులు ఎలా?
కొత్త విధానంలో హెచ్ఎం ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ముందస్తు బిల్లుల సమర్పణ. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పాఠశాలల్లో జరగబోయే వివిధ రకాల ఖర్చులకు ఇప్పుడే బిల్లులు సమర్పించాలని సూచిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే విద్యా సంవత్సరం ముగిసే వరకు అవసరాలు విడతలవారీగా ఏర్పడుతుంటాయి. ఏ సమయంలో ఏ వస్తువు అవసరమవుతుందో ముందుగానే నిర్ణయించడం సాధ్యం కాదని వారు పేర్కొంటున్నారు. ఇంకా కొనుగోలు చేయని వస్తువులకు వ్యాపారులు ముందస్తుగా బిల్లులు ఎలా ఇస్తారని, పనులు ప్రారంభించకుండానే వాటి ఖర్చులకు సంబంధించిన రశీదులు ఎలా సమర్పించాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారుల సమస్యలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు తమ రోజువారీ అవసరాల కోసం స్థానిక కిరాణా దుకాణాలు, స్టేషనరీ షాపులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లపై ఆధారపడుతుంటాయి. చిన్నచిన్న అవసరాలకు రూ.వందలు, వేలల్లో చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే స్థానిక చిరు వ్యాపారుల్లో చాలామందికి జీఎస్టీ రిజిస్ట్రేషన్, అవసరమైన బ్యాంకింగ్ సదుపాయాలు, ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన ఉండకపోవడంతో వెండర్లుగా నమోదు చేయడం కష్టతరంగా మారుతోంది. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం వ్యాపారుల ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు సేకరించి పోర్టల్లో నమోదు చేయడం ప్రధానోపాధ్యాయులకు అదనపు పనిభారంగా మారుతోంది.
స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి
పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులను సకాలంలో వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత అవసరమే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వాస్తవ సమస్యలను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందస్తు బిల్లుల సమర్పణపై ఉన్న సందిగ్ధతను తొలగించి, వాస్తవంగా కొనుగోళ్లు, పనులు పూర్తయిన తర్వాత బిల్లులు సమర్పించేలా నిబంధనలను సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సరళమైన చెల్లింపు విధానం రావాలి..
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా సరళమైన చెల్లింపుల విధానాన్ని రూపొందించాలని, వెండర్ల ఖాతాల్లోకి నిధులు సకాలంలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందులోనూ ఇంకా ఎస్సీ ఎస్టీ జనరల్ క్రియలకు సంబంధించిన బిల్లులు సైతం వేర్వేరుగా పెట్టాలని పేర్కొనడం గమనార్హం… ఇలా పాఠశాలల నిర్వహణకు సంబంధించిన గ్రాంట్ల వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను తక్షణమే విడుదల చేసి, ప్రధానోపాధ్యాయులపై అదనపు ఆర్థిక, పరిపాలనా భారాన్ని తగ్గించాలని ఉపాధ్యాయులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


