ధర్మారెడ్డిపల్లి సమీపంలో అధ్వానంగా గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారి
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి , టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిలివేరి ఇంద్ర గౌడ్ డిమాండ్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో గజ్వేల్ పట్టణం నుండి చేగుంట వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ గజ్వేల్ నియోజకవర్గ నాయకుడు సిలివేరి ఇంద్ర గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మారెడ్డిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి కింద వేసిన సీసీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని, అందులోని ఐరన్ రాడ్లు పైకి తేలి ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాడ్లు పైకి తేలడం వల్ల అటుగా రాకపోకలు సాగించే వాహనదారుల టైర్లు పగిలిపోవడంతో పాటు, నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇదివరకే ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగి పలువురు తీవ్ర గాయాలపాలైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తీవ్ర సమస్యపై మీడియా ద్వారా ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత శోచనీయమన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ప్రమాదకరంగా మారిన రైల్వే బ్రిడ్జి కింద సీసీ రోడ్డుతో పాటు మొత్తం రహదారికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అలిపాష, కనకచారి, గణేష్, సురేష్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


