అక్రమంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కస్టమర్ సర్వీస్ పాయింట్ కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ వడ్డీ వ్యాపారం
నిందితుడి వద్ద నుంచి చెక్కు, బ్యాంకు పాస్ పుస్తకం, డిపాజిట్ రశీదులు, నకిలీ రబ్బరు ముద్ర స్వాధీనం... ఎస్ హెచ్ ఓ బి. ప్రవీణ్ కుమార్
నిందితుడు అడే కైలాష్ అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ ఎక్స్ రోడ్ వద్ద ఎస్బీఐ బ్యాంకు సమీపంలో నిర్వహిస్తున్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అమాయక ప్రజలకు అధిక వడ్డీపై అప్పులు ఇచ్చి వారి వద్ద నుంచి చెక్కులు, ఇతర పత్రాలు సేకరిస్తూ, ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా బ్యాంకు సేవా కేంద్రం ముద్రను దుర్వినియోగం చేస్తూ నకిలీ రబ్బరు ముద్రను ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో 501/2026, తెలంగాణ ప్రాంత వడ్డీ వ్యాపారుల చట్టం సెక్షన్ 3(5)(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి ఒక ఖాళీ చెక్కు, ఒక బ్యాంకు పాస్ పుస్తకం, సేవా కేంద్రం ముద్రతో ఉన్న రెండు బ్యాంకు డిపాజిట్ రశీదులు, నాలుగు బ్యాంకు డిపాజిట్ రశీదులు, ఒక నకిలీ రబ్బరు ముద్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేని వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


