తెలంగాణ కరువుపై కేంద్రం స్పందించాలి

క్షేత్రస్థాయిలో పరిశీలించి రూ.30 వేల కోట్ల నిధులు విడుదల చేయాలి , ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి డిమాండ్‌.. , నర్సింహులగూడెంలో ఎండిన పంటల పరిశీలన , సాగు త్రాగునీటికి ఇబ్బందులు

తెలంగాణ కరువుపై కేంద్రం స్పందించాలి

నాంపల్లి :  ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, రైతులను ఆదుకునేందుకు రూ.30 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.సోమవారం నాంపల్లి మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను సందర్శించి వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న పత్తి, వరి పంటలను పరిశీలించారు. పొలాల్లో పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలు ఎదగకపోవడం, పెట్టుబడులు పెట్టిన రైతులకు ఆశించిన దిగుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడం వంటి సమస్యలను రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. వేలాది ఎకరాల్లో పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతింటున్నాయని, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం కేవలం కార్యాలయాల్లో కూర్చొని నివేదికలు తీసుకోవడం కాకుండా, ప్రత్యేక బృందాలను తెలంగాణలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు పంపించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, రైతులకు న్యాయం జరిగేలా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కరువు నివారణ, రైతుల ఉపశమనం, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.30 వేల కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను కూడా గ్రామస్తులు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు వారానికి ఒక్కసారి మాత్రమే వస్తోందని, దీంతో నిత్యావసరాలకు సరిపడా నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి పరిస్థితులను తలపించేలా నీటి ఎద్దడి నెలకొంటోందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని వివరించారు.అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఒకవైపు పంటలు ఎండిపోతుండగా, మరోవైపు గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీవ్రతరం కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయాలను తొలగించి ప్రతిరోజూ గ్రామస్తులకు తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు పరిస్థితులను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి రైతులకు పంట నష్టపరిహారం, అవసరమైన ఆర్థిక సహాయం అందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత గ్రామాల్లో పర్యటనలు కొనసాగించి రైతులు, గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే