రైతు గర్జన పేరుతో రాజకీయ డ్రామా.. రైతుల సమస్యలపై మాట్లాడకుండా కేటీఆర్ పసలేని విమర్శలు... కాంగ్రెస్ నాయకులు
చనాక–కొరాట బ్యారేజ్ అవినీతిపై సమాధానం చెప్పాలి..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం: బాలూరి గోవర్ధన్ రెడ్డి, పసుల చంటి
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్యక్రమం రైతు గర్జన కాదని, రైతుల పేరుతో నిర్వహించిన ఒక రాజకీయ ఈవెంట్ షో మాత్రమేనని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు బాలూరి గోవర్ధన్ రెడ్డి , పసుల చంటి గారు విమర్శించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, చనాక–కొరాట బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ఆయన సొంత సోదరి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెబుతారని ఆశిస్తే కేటీఆర్ వాటిని పక్కనపెట్టి పసలేని రాజకీయ విమర్శలు చేశారని అన్నారు. తొలుత రూ.350 కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,800 కోట్లకు చేరినా, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించలేకపోయిందని బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.రాష్ట్రంలో అప్పుల భారం ఉన్నప్పటికీ రైతులు పండించిన పంటను, ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బడే బై చోటే బాయ్ అనడం వింతగా ఉందని కెసిఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం తో ఘర్షణ దిగి రాష్ట్రానికి అన్యాయం చేశారని కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలు చేస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు నిధులు సాధించడం ముఖ్యమంత్రి పరిపాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని, బోర్లలో నీరు ఉన్న రైతులు వ్యవసాయం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల కింద సాగునీటిని వినియోగించుకునే రైతులు డిసెంబర్ 31లోపు మూడో తడి అందేలా పంటల ప్రణాళిక చేసుకోవాలని మాత్రమే సూచించారని బాలూరి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతో కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సొంత సోదరి కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ ఇతరులపై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి మాట్లాడుతూ, కేటీఆర్ ఆదిలాబాద్‌కు రైతుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయంగా తమ పార్టీ నాయకులను ప్రోత్సహించడానికి, తమ బలాన్ని ప్రదర్శించడానికి వచ్చినట్లు ఉందని విమర్శించారు.కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కడెం ప్రాజెక్టును కాపాడలేకపోవడంతో పాటు కుప్టి ప్రాజెక్టును నిర్మించలేకపోయారని అలాగే చిక్మన్ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జిల్లాకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టుల కంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాజకీయ ప్రచారానికే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా లేదని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, రైతు బీమా పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ హయాంలో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకే అభివృద్ధిని పరిమితం చేశారని ఆరోపించారు. యూరియా సరఫరా, యాప్ విధానం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదని అన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా ఇంటి నుంచే పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలపై ప్రభావం పడుతోందని, తెలంగాణలో మాత్రమే కరువు పరిస్థితులు ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం సరికాదని పసుల చంటి అన్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో కరువు మండలాల ప్రకటనతో పాటు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి కేంద్ర ప్రభుత్వం బిజెపి పై పోరాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే గత పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో, చనాక–కొరాట బ్యారేజ్ ద్వారా ఒక్క ఎకరానికైనా సాగునీరు ఎందుకు అందించలేకపోయారో కేటీఆర్ ప్రజలకు వివరించాలని ఇరువురు నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపించడమే నిజమైన రైతు గర్జన తప్ప, ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవడం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కీజర్ పాష , జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గోనెల స్వామి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుగత్, పట్టణంలోని వార్డు ప్రెసిడెంట్లు సంతోష్ ఫహీం, టౌన్ కాంగ్రెస్ సెక్రెటరీ ఆదిల్, రాజా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


