కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ - చెరువు భూములను కాపాడి, అక్రమ పట్టాలు రద్దు చేయాలని DRO. రాథోడ్ రమేష్ కు వినతి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ జిల్లా రెవెన్యూ అధికారి (DRO) రాథోడ్ రమేష్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, కాసర్/కంచెరోని చెరువు పరిధిలోని సర్వే నంబర్ 1374లో సుమారు 29 గుంటల శిఖం భూమితో పాటు FTL, బఫర్ జోన్ పరిధిలో అక్రమ ఆక్రమణలు జరిగాయని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అక్రమ పట్టాలు సృష్టించి శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపించారు. చెరువు శిఖం భూములు, FTL, బఫర్ జోన్ పరిధిలో పట్టాలు మంజూరు చేయడం, నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పులు, WALTA చట్టం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములు ఆక్రమణకు గురవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చెరువును సమగ్రంగా సర్వే చేయాలని, సర్వే నంబర్ 1374లో అక్రమంగా జారీ చేసిన పట్టాలను పరిశీలించి రద్దు చేయాలని కోరారు. చెరువు శిఖం భూమి, FTL, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చెరువు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజా ప్రయోజనార్థం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ను ఆశ్రయించాల్సి వస్తుందని సయ్యద్ హైదర్ స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

