పోలీసింగ్పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్
శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్ విధులపై ప్రత్యక్ష అనుభవం పొందాలి
ప్రజలకు మెరుగైన సేవలు అందించే సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శిక్షణ డీఎస్పీలకు దిశా నిర్దేశం* ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 23 (విజన్ ఆంధ్ర)పోలీస్ శాఖలో విధులు, బాధ్యతలు, పోలీసింగ్ విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. పోలీస్ శాఖలో శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి ప్రాక్టికల్ శిక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన నలుగురు నూతన ట్రైనీ డీఎస్పీలు సామ సాత్విక, సిద్దోజి రాణి, ఆర్. ఆదిత్య, నాతి యువిక మిత్ర సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారికి జిల్లాలో కేటాయించిన వివిధ పోలీస్ విభాగాలు, ఆయా విభాగాల విధులు, బాధ్యతలు, పోలీస్ శాఖ పనితీరుపై వివరించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల నమోదు, నేరాల దర్యాప్తు, నిందితుల గుర్తింపు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు విధానాలు, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవం పొందాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు విధులు, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, మహిళలు మరియు బాలల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. శిక్షణ సమయంలో కేవలం పరిశీలనకే పరిమితం కాకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, సీనియర్ అధికారుల అనుభవాలను తెలుసుకుంటూ విధి నిర్వహణలోని మెళకువలను నేర్చుకోవాలని సూచించారు. నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక సామర్థ్యం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని చూరగొంటూ బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలని ట్రైనీ డీఎస్పీలకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


