సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి బ్యూరో : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు.దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రత పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు.
భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి సమైక్య, బలమైన భారతదేశ నిర్మాణానికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల అచంచలమైన నిబద్ధత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, అంతర్గత భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలుగుతూ దేశ అభివృద్ధి, శాంతిభద్రతలు, సామాజిక సామరస్యానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రజల భద్రతతో పాటు దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

