బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. పెన్షన్ కట్!
30 ఏళ్లుగా కంటి చూపు లేక అవస్థలు.. అనారోగ్యంతో వృద్ధుడి సతమతం
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : బతికున్న వృద్ధుడిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్లు నమోదు చేయడంతో పెన్షన్ నిలిచిపోయిన ఘటన కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నికాడి బాపు (80) గతంలో ఐదేళ్లపాటు నెలకు రూ.200 పెన్షన్ పొందినట్లు తెలిపారు. అనంతరం పెన్షన్ నిలిచిపోవడంతో అధికారులను సంప్రదించగా, రికార్డుల్లో తాను మరణించినట్లు నమోదైందని చెప్పినట్లు వెల్లడించారు. తాను బతికే ఉన్నానని పలుమార్లు అధికారులకు తెలియజేసి, పెన్షన్ పునరుద్ధరించాలని దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా కంటి చూపు లేక ఇబ్బందులు పడుతున్నానని, ప్రస్తుతం మూర్ఛ వ్యాధితో బాధపడుతూ తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రికార్డుల్లో తప్పులను సరిచేసి, అర్హత మేరకు పెన్షన్ పునరుద్ధరించాలని నికాడి బాపు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


