వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
స్టేషన్ ఘన్పూర్ : జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిల్పూరుగుట్ట శ్రీశ్రీశ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండువగా సాగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, సంప్రదాయబద్ధమైన వైదిక క్రతువులతో స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కిరణ్మయి దంపతులతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చిల్పూర్ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, వివిధ పట్టణాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి లక్ష్మీ ప్రసన్న, అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి, శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులకు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


