ఇందిరా గాంధీ గారి ఆశయాలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం – డాక్టర్ నరేష్ జాదవ్ గారూ
ఢిల్లీలోని ఇందిరా భవన్లో స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల తో కలిసి ఘన నివాళులు అర్పించిన డీసీసీ డా నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు
ఆదిలాబాద్ బ్యూరో : ఛలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో' కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఢిల్లీకి చేరుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ నాయకత్వంలో ఢిల్లీలోని ఇందిరా భవన్లో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధీ దేశ సమగ్రత, సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు. దేశ ప్రధానిగా ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
ముఖ్యంగా ఇందిరా గాంధీ తీసుకున్న బ్యాంకుల జాతీయకరణ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు అని గుర్తుచేశారు. అప్పటివరకు కేవలం కొద్దిమంది సంపన్నులకే పరిమితమైన బ్యాంకింగ్ వ్యవస్థను, సాధారణ ప్రజలకు, రైతులకు, చిన్న వ్యాపారులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆమెదేనని కొనియాడారు. 'గరీబీ హటావో' నినాదంతో భూ సంస్కరణలు అమలు చేసి, భూమి లేని నిరుపేదలకు, దళితులకు వేలాది ఎకరాల భూములను పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ పేదల జీవితాల్లో ఆమె వెలుగులు నింపారని అన్నారు .
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరా గాంధీ చేసిన త్యాగం అసమానమైనదని, ఆమె ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం నిలబడిన ధైర్యసాహసాలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
నేటి రాజకీయ పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతోందని తెలిపారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి ఓటు విలువను కాపాడుకోవడం మనందరి కాంగ్రెస్ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ , డాక్టర్ వెన్నెల గద్దర్ లతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


