ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘చలో ఢిల్లీ’కి పయనమైన నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ శ్రేణులు
* ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీకి తరలివెళ్లిన ఏడు మండలాల కాంగ్రెస్ నాయకులు * 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం * రాహుల్ గాంధీ పిలుపు మేరకు రామ్లీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీ
నిజామాబాద్ : ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల రక్షణ, ప్రజల ఓటుహక్కును కాపాడాలనే లక్ష్యంతో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాయి.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిపి 100 మందికి పైగా ఢిల్లీకి బయలుదేరారు. కొందరు రైలు మార్గంలో,హైదరాబాద్, నాగ్పూర్ విమానాశ్రయం నుంచి విమానాల ద్వారా, మరికొందరు బస్సులు ఇతరత్రా రవాణా, మార్గాల ద్వార ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR ప్రక్రియ పేరుతో దేశ ప్రజల రాజ్యాంగబద్ధమైన ఓటుహక్కుకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల ఓటుహక్కును పరిరక్షించడంతో పాటు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. SIR వివాదానికి సంబంధించి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్లు సాయారెడ్డి, తారాచంద్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతల కిషన్, గోవర్ధన్ రెడ్డి, రవి, గాదె నరేష్, జనార్ధన్, మాజీ ఎంపీపీ రాజన్న, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మహేందర్, కార్పొరేటర్ భోజన్న, తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


