నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.
క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రు.197.44 కోట్లు సుందరీకరణ నమూనాను ఆవిష్కరించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మేయర్.
నల్లగొండ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు ప్రభుత్వం రూ.197.44 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ నిధులతో క్లాక్ టవర్ సెంటర్ ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్ లో క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణ నమూనా మోడల్ ను డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్లతో కలిసి ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం నల్లగొండ నగర అభివృద్ధిలో కీలక ముందడుగని పేర్కొన్నారు. కార్పొరేషన్ కు మరింత ఆధునిక రూపాన్ని తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు.స్మార్ట్ సిటీలో భాగంగా పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ.197.44 కోట్లు మంజూరైనట్లు వివరించారు.
క్లాక్ టవర్ సెంటర్ లోని పాత ఆర్ & బి కార్యాలయం స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్,అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్ ను అధునాతన రీతిలో అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంకు రూ.138.21 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం రూ.59.23 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
నల్లగొండ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న క్లాక్ టవర్ సెంటర్ ను ఆధునిక సౌకర్యాలతో సుందరీకరించి ప్రజలకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేయడం ద్వారా వాణిజ్య కార్యకర్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని,నగర ప్రజలకు మెరుగైన షాపింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.క్లాక్ టవర్ సెంటర్ అభివృద్ధిలో భాగంగా మల్టీప్లెక్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించామని,దీనివల్ల నగర ప్రజలకు వినోద సౌకర్యాలు మరింత చేరువవుతాయని అన్నారు. దీని ద్వారా కొత్త ఆకర్షణ తీసుకురావడంతో పాటు నగర ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు.షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ వంటి సదుపాయాల అభివృద్ధితో స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు నగర ఆర్థిక కార్యకలాపాలకు కూడా మేలు జరుగుతుందన్నారు.నల్లగొండ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని,ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ నగర అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఇప్పటికే నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.ఇటీవలనే పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు, సాగర్ రోడ్డులో వైయస్సార్ విగ్రహం నుంచి చర్లగూడెం రోడ్డు వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.అదేవిధంగా100 కోట్లతో నల్లగొండ పట్టణంలో సయ్యద్ లతీఫుల్లా ఖాద్రి గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు ఘాట్ రోడ్లను నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
స్మార్ట్ సిటీలో భాగంగా నల్లగొండ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ మున్సిపల్ పాలకవర్గం,పట్టణ ప్రజల తరఫున మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ,కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి,గుమ్ముల జానకి మోహన్ రెడ్డి,ఇబ్రహీం, ఆలకుంట్ల నాగరాజు,అబ్బగోని కవితా రమేష్ గౌడ్,బొజ్జ శంకర్,ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, పెరిక స్వాతి,ఆలకుంట్ల ఝాన్సీ,అల్లి సుభాష్ యాదవ్, రేగట్టే అండాలు,పున్న జ్ఞానేశ్వరి, పాలకూరి సుమలత,గోగుల గణేష్,వజ్జ సంతోషిని,గుండెబోయిన పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


