రిమ్స్‌లో మృతి చెందిన గర్భిణి ,కవల పిల్లలు మృతి చెందడంతో వారి కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్
*సునీత కుటుంబానికి అండగా ఉంటాం: కలెక్టర్ రాజర్షి
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణి బోర్కర్ సునీత,ఆమె కడుపులోని కవల శిశువులు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్షి స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. ఈ ఘటనపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్,బాధిత కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వైద్యులు,విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించగా,ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సునీత ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందడం,ఆమె కడుపులోని కవల శిశువులు కూడా మృతి చెందడం అత్యంత బాధాకరమని దుర్గం శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రాజర్షి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చే అంశంపై చర్యలు తీసుకుంటామని,సునీత ఎనిమిదేళ్ల కుమార్తె చదువుల ఖర్చులను ప్రభుత్వం భరించేలా సంబంధిత రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడతామని తెలిపారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు అవసరమైన సహాయం అందించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన అనంతరం నిర్లక్ష్యం వహించినట్లు తేలితే సంబంధిత వైద్యులు, విధుల్లో ఉన్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి కు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, దళిత జేఏసీ అధ్యక్షుడు కాంబ్లే ప్రజ్ఞాశీల్, పీఎస్‌ఎస్‌ఓ జాడి వెంకటేష్, బోర్కర్ రాజ్ కుమార్, జాడి రాజేశ్వర్, బండారి పోశన్నతో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


