పెద్దశంకరంపేట మండలంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
అనుమతులు లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
పెద్ద శంకరంపేట్ : మెదక్ డిప్యూటీ కమిషనర్ (ఎక్సైజ్) ఏ. చంద్రయ్య, డీపీఈఓ ఎల్. నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు మెదక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్దశంకరంపేట మండలంలో కల్లు దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో కల్లు దుకాణాలను తనిఖీ చేస్తూ నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నారు. అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సెప్టెంబర్ 9న బూరుగుపల్లి, విరోజిపల్లి గ్రామాల్లోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. అలాగే లక్ష్మణపూర్ ప్రాంతంలోని టీసీఎస్ యూనిట్‌లో కల్లు నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 13న శీతారాంపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు కల్లు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సుమారు 160 లీటర్ల కల్లును ధ్వంసం చేసి, ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి కూడా నమూనాలను సేకరించారు. అక్టోబర్ 26న శివ్వాయిపల్లి, తిరుమలాపూర్, శంకరంపేట గ్రామాల్లోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించారు. కల్తీ కల్లు విక్రయించినట్లు నిర్ధారణ అయినా, అనుమతులు లేకుండా కల్లు దుకాణాలు నిర్వహించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మెదక్ ఎక్సైజ్ అధికారి ఏ. వెంకటేశ్, ఎస్‌ఐ టి. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


