స్థానికుల ఇళ్లన్నీ జాబితాలో చేర్చే వరకు పనులు సాగనివ్వం!
2,265 ఇళ్లకు గాను 847 మాత్రమే డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో నమోదు జెన్‌కో అధికారులను అడ్డుకున్న మాజీ ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గేది లేదు.. నిర్వాసితుల హెచ్చరిక
మల్హర్ : తాడిచర్ల ఓసీపీ డేంజర్ జోన్ సమీపంలో పనులు చేపట్టేందుకు వచ్చిన జెన్‌కో అధికారులను స్థానిక మాజీ ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి ఆధ్వర్యంలో నిర్వాసితులు శుక్రవారం తీవ్రంగా అడ్డుకున్నారు. స్థానికుల ఇళ్లన్నింటినీ డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో చేర్చి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాస స్థలాలు కేటాయించిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చిచెప్పారు. తమ ప్రాణాలు పోయినా పనులు సాగనివ్వబోమని హెచ్చరించారు. 2,265 ఇళ్లలో 847 మాత్రమేనా? 2022లో విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో 2,265 గృహాలను గుర్తించిన అధికారులు, నాలుగేళ్ల పాటు వివిధ సర్వేల పేరుతో కాలయాపన చేసి 2026లో విడుదల చేసిన డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో కేవలం 847 ఇళ్లను మాత్రమే చేర్చడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నించారు. స్థానికుల ఇళ్లను కావాలనే జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దుమ్ము, ధూళితో నరకయాతన ఓసీపీ పరిసరాల్లో దుమ్ము, ధూళి, విషవాయువులతో ఇప్పటికే నరకయాతన అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో తమ అభ్యంతరాలు తెలియజేసినా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్నప్పటికీ తమకు నమ్మకం లేదని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి స్థానికులందరికీ న్యాయం చేయాలని కోరారు. అక్రమ కేసులకు భయపడేది లేదు స్థానికులకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని, అక్రమ కేసులు పెడతామన్నా భయపడేది లేదని నిర్వాసితులు స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో తప్పిపోయిన ఇళ్లన్నింటినీ నమోదు చేసి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాస స్థలాలు కేటాయించే వరకు డేంజర్ జోన్ సమీపంలో పనులు జరగనివ్వబోమని హెచ్చరించారు. ఆందోళనకారులకు జెన్‌కో అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం ఆందోళనకారులు నిరసన విరమించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


