నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల
నవంబర్ 26 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ - కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్ : ఎస్ఐఆర్ ఓటరు జాబితా సవరణ గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వెల్లడించారు. నవంబర్ 26 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పుల్లేకుండా సవరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. బీఎల్ఓల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.
ఓటరు జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమన్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువుగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాల్లో 29,890 మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకున్నారని, పరిశీలనలో మరో 1,335 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అర్హత ఉన్న పెండింగ్ దరఖాస్తులకు నిబంధనల ప్రకారం ఆమోదం తెలుపుతామన్నారు. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని, చునావ్ పాఠశాల కార్యక్రమం ద్వారా ఓటు ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం చేపడుతున్నామని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


