పేదల పొట్ట కొట్టొద్దు.. కొల్లాపూర్ చౌరస్తాలో ఉపాధిని తొలగించొద్దు - బీఎస్పీ
నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ పట్టణ సుందరీకరణ పేరుతో నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ అన్నారు.
నాగర్‌కర్నూల్ పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఎస్పీ కార్యాలయం పక్క నుంచి చౌరస్తా వరకు దాదాపు 10 మంది నిరుపేదలు చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారి ఉపాధిని తొలగించాలనే మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఎస్పీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులు రోజుకు రూ.200 నుంచి 300 సంపాదించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ప్రతిరోజూ రూ.50 నుంచి 100 వరకు తైబజార్ రుసుము కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక పట్టణాలకు వలస వస్తున్న తరుణంలో, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వమే చెబుతున్న సమయంలో పేదలకు ఉన్న కొద్దిపాటి ఉపాధిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ఉపాధి కల్పించకపోయినా పర్వాలేదు కానీ, ఉన్న ఉపాధిని తొలగించడం తగదన్నారు. నవంబర్ 3లోగా డబ్బాలను తొలగించాలని గడువు విధించడం పేదల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పేదల ఉపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా జీవనోపాధిని తొలగించవద్దని డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కలిసి పేదల సమస్యను వివరిస్తామని, అవసరమైతే పేదల తరపున నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ తాడూరు మండల అధ్యక్షులు జన్ను ఆంజనేయులు, పద్మ, లావణ్య, బాలిశ్వరమ్మ, గీత తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


