నల్ల బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
ప్రవళికకు న్యాయం చేయాలని డిమాండ్ - నాగర్కర్నూల్ డిపోలో ఘన నివాళులు
నాగర్కర్నూల్ : మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు నవంబర్ 4న నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రవళికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టికెట్ ఛార్జీ, చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో బస్సు నుంచి కిందకు తోసివేయడంతో వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడిన 24 ఏళ్ల ప్రవళిక పది రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందింది. విధి నిర్వహణలో మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని యూనియన్ నాయకులు అన్నారు. ప్రవళికకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, "అమర్ హై ప్రవళిక" అంటూ ఘన నివాళులు అర్పించారు. ప్రవళిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయాణికులు సంయమనం పాటించాలని, ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ డిపోలో నాయకులు, ఉద్యోగులు ఐక్యంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


