బియ్యం దుకాణాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు!
ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.. నిర్ణీత ధరలకే విక్రయించాలి అధిక ధరలకు విక్రయిస్తే 6ఏ కేసులు నమోదు చేస్తాం – అధికారులు హెచ్చరిక
కొత్తగూడెం బ్యూరో : బియ్యం విక్రయాల్లో అధిక ధరలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ సివిల్ సప్లైస్, హైదరాబాద్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పలు బియ్యం విక్రయ దుకాణాల్లో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీఎం (సివిల్ సప్లైస్), డీటీఎస్‌లు డి. శంకర్ రావు (కొత్తగూడెం), జి. ప్రభాకర్ (మణుగూరు), జి. రాజులు (అశ్వారావుపేట), ఎం. రాజేశ్వరరావు (భద్రాచలం) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి బియ్యం దుకాణంలో విక్రయ ధరలకు సంబంధించిన పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందులో పేర్కొన్న నిర్ణీత ధరల ప్రకారమే వినియోగదారులకు బియ్యం విక్రయించాలని దుకాణదారులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం 6ఏ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి
బియ్యం దుకాణదారులు నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేసినట్లయితే వినియోగదారులు వెంటనే సివిల్ సప్లైస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బియ్యం విక్రయ దుకాణాల యజమానులు ధరల పట్టికలను ఏర్పాటు చేసి, వాటి ప్రకారమే విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన ధరలకు నిత్యావసర సరుకులు అందించడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

