జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో పీఎం పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు జింద్ రైల్వేస్టేషన్‌లో జింద్-సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు జింద్‌లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి చండీగఢ్ వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం సుమారు 1:45 గంటలకు రూ. 6,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తదనంతరం ప్రధానమంత్రి జలంధర్‌ను సందర్శిస్తారు. అక్కడ రూ. 5,470 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
జింద్‌లో పీఎం
హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా వ్యవస్థ దిశగా ఇది కీలక ముందడుగు. భారతదేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, ఏకీకృతం చేసిన ఈ రైలును దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. అత్యాధునిక రైల్వే ఇంజనీరింగ్‌లో పెరుగుతున్న దేశీయ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న ఎంపిక చేసిన కొన్ని దేశాల సరసన భారత్ చేరుతుంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో ఈ రైలు నడుస్తుంది. ఇది హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉప-ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీని వల్ల రైలు నడిచే సమయంలో కర్బన ఉద్గారాలు వెలువడవు.
డీజిల్ రైళ్లతో పోలిస్తే పొగ గొట్టాల ద్వారా వచ్చే ఉద్గారాలను ఇవి పూర్తిగా నివారిస్తాయి. శిలాజ ఇంధనాలు, వాటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. అలాగే చాలా తక్కువ శబ్దంతో నడుస్తాయి. సంప్రదాయ విద్యుత్ రైళ్లతో పోలిస్తే వీటికి నిరంతర ఓవర్‌హెడ్ విద్యుద్దీకరణ మౌలిక సదుపాయాలు అవసరం లేదు. ఇందులోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా రైలులోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది వీటిని అత్యంత స్వచ్ఛమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారుస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ వాడకం వల్ల శిలాజ ఇంధన ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌పై ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇది సుస్థిర రవాణా వ్యవస్థ దిశగా భారత్ సాగించే ప్రయాణానికి దోహదపడుతుంది.
భారతదేశ హైడ్రోజన్ రైలును 10 కోచ్‌లతో రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ఆధారిత ప్రయాణీకుల రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది 3,200 హెచ్‌పీ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. హర్యానాలో రూ. 12,470 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయటంతో పాటు, శంకుస్థాపనలు చేస్తారు.
సుమారు రూ.9,680 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 157.92 కిలోమీటర్ల పొడవైన, నాలుగు వరుసల, పూర్తి నియంత్రిత ప్రవేశం గల ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీలు 1 నుంచి 5)ను ప్రధానమంత్రి జాతికి అంకితం ఇవ్వనున్నారు. 667 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఒక భాగం. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఢిల్లీ, కత్రా మధ్య ప్రయాణ సమయం సుమారు 14 గంటల నుంచి దాదాపు 6 గంటలకు తగ్గుతుంది. ఢిల్లీ-అమృత్‌సర్ ప్రయాణ సమయం 8 గంటల నుంచి 4 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఎన్‌హెచ్-44 (జీటీ రోడ్)పై ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించటమే కాక, శ్రీ మాతా వైష్ణో దేవికి వెళ్లే యాత్రికులు, పర్యాటకుల సంఖ్యను పెంచుతుందని... ఈ కారిడార్ వెంట పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.
ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-344 లపై ఉన్న 33.81 కిలోమీటర్ల పొడవైన, నాలుగు వరుసల, పాక్షికంగా నియంత్రిత ప్రవేశం గల అంబాలా-కాలా అంబ్ హైవేను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ హైవే అంబాలా పట్టణ ప్రాంతానికి, కాలా అంబ్ పారిశ్రామిక ప్రాంతానికి మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య రహదారి మార్గాలను మెరుగుపరుస్తుంది. కొండ ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలను సులభతరం చేస్తుంది. కాలా అంబ్ ప్రాంతంలోని పరిశ్రమల రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.
ఎన్‌హెచ్-352ఏపై నిర్మించిన 40.60 కిలోమీటర్ల పొడవైన జింద్-గోహనా గ్రీన్‌ఫీల్డ్ హైవే జాతికి అంకితం చేయనున్న మరో ప్రధాన ప్రాజెక్టు. ఈ కొత్త హైవే వల్ల జింద్, గోహనా మధ్య ప్రయాణ సమయం సుమారు రెండు గంటల నుంచి కేవలం 40 నిమిషాలకు తగ్గుతుంది. ఇది ప్రయాణికులకు, సరకు రవాణాకు, వ్యవసాయ పరంగా ఎంతో ప్రాధాన్యత గల జింద్-గోహనా ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. రోహ్‌తక్, పానిపట్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలకు అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
దీనితో పాటు 24.27 కిలోమీటర్ల పొడవైన హన్సి-బర్వాలా బ్రౌన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతమున్న రహదారిని పేవ్డ్ షోల్డర్స్ గల 2,4-లైన్ల రహదారిగా ఆధునీకరిస్తారు.
కురుక్షేత్ర నగర పరిధిలోని రైల్వే క్రాసింగుల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించే ప్రధాన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వాహనాల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. రహదారి భద్రత మెరుగవుతుంది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థల పనితీరు సామర్థ్యం పెరుగుతుంది.
ప్రధాన వైద్య సంస్థలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో భివానీలోని పండిట్ నేకి రామ్ శర్మ ప్రభుత్వ వైద్య కళాశాల, నార్నాల్‌లోని కొరియావాస్ వద్ద ఉన్న మహర్షి చ్యవన్ వైద్య కళాశాల, రావు తులా రామ్ ఆస్పత్రి ఉన్నాయి. ఈ సంస్థలు హర్యానాలో నాణ్యమైన వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుతాయి. ఆరోగ్య సంరక్షణ నిపుణుల లభ్యతను మెరుగుపరుస్తాయి. ఇళ్ల వద్దే ప్రజలు మెరుగైన వైద్య సేవలను పొందేలా చేస్తాయి. తద్వారా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఈ ప్రాంత సాంస్కృతిక మౌలిక సదుపాయాలను మరింత సుసంపన్నం చేస్తూ.. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సిక్కు మత చరిత్ర, సిక్కు గురువుల బోధనలు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలు, భారత నాగరికత, సంస్కృతులకు సిక్కు సమాజం అందించిన అమూల్యమైన సహకారాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

