యూనిక్ కంపెనీ పెట్టుబడుల పేరుతొ భారత్ లో భారీ మోసం..!
- తెలంగాణ రాష్ట్రంలోనే వందల కోట్ల రూపాయల మోసం..!
- దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది బాధితులు..!
- కుట్రను చేధించిన ఆదిలాబాద్ పోలీసులు.. ప్రధాన నిందితుని అరెస్ట్..!
- వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్..
ఆదిలాబాద్ : యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్, యూనిక్ ఎస్ఎంసీఎస్ సంస్థల పేరుతో చిట్ ఫండ్స్, పెట్టుబడి పథకాల ద్వారా అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసం జరిగినట్లు, దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మోసం చేసిన తీరు నిందితులు యూనిక్ సంస్థల పేరుతో వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి, ఏజెంట్ల ద్వారా ప్రజలను ఆకర్షించినట్లు విచారణలో వెల్లడైంది.
వార్షిక చెల్లింపులు, నెలవారీ కిస్తీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు తదితర పథకాల ద్వారా డబ్బులు సేకరించారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి అదనపు ప్రయోజనాలు కలిపి తిరిగి చెల్లిస్తామని, అవసరమైతే మంచి ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయిస్తామని నమ్మించారు. గడువు పూర్తయినప్పటికీ పెట్టుబడి మొత్తాలు, మెచ్యూరిటీ డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఆదిలాబాద్ వన్‌టౌన్, టూటౌన్, మావల, ఆదిలాబాద్ రూరల్, తలమడుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక విచారణ ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థలకు సంబంధించి 14 కేసులు నమోదైనట్లు గుర్తించారు.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ కేసులు నమోదైనట్లు సమాచారం ఉందని, ఈ వివరాలపై సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్తుల కొనుగోలుకు మోసం చేసిన సొమ్ము వినియోగంప్రజల నుంచి సేకరించిన డబ్బులతో నిందితుడు వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. బెంగళూరు, పశ్చిమ బెంగాల్, జైపూర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో హోటళ్లు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు, ముఖ్యంగా మియాపూర్ ప్రాంతంలో సుమారు 400 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే బీబీనగర్‌లోని ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సుమారు 2,000 మంది సభ్యులతో రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు నిందితుడి విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో బాధితులు కోల్పోయిన మొత్తం, ఇతర ఆర్థిక వివరాలను మరింతగా పరిశీలిస్తున్నారు.ప్రధాన నిందితుడి అరెస్ట్తలమడుగు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విశ్వసనీయ సమాచారం మేరకు 13న రాత్రి ఆదిలాబాద్ కలెక్టరేట్ చౌక్ వద్ద ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తలమడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించి చట్టప్రకారం అరెస్ట్ చేశారు.
నిందితుల వివరాలు :
A-1: రాజ్ కుమార్ రాయ్ @ రాజ్ కుమార్ కైలాష్ రాయ్ (69)యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ / హోల్‌టైమ్ డైరెక్టర్. నివాసం: థల్తేజ్, అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రం.స్థితి:అరెస్ట్., A-2: చంద్రశేఖర్యూనిక్ ఎస్ఎంసీఎస్ సంస్థ జోనల్ మేనేజర్, హైదరాబాద్.స్థితి: పరారీలో ఉన్నాడు. గతంలోనూ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. నిందితుడు గతంలో మెడికల్ కంపెనీ ఏర్పాటు పేరుతో, హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడినట్లు సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసులు, ఇతర వివరాలను పరిశీలిస్తూ నిందితుడి గత కార్యకలాపాలపైనా దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులు ముందుకు రావాలి :
యూనిక్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఎవరూ భయపడకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. బాధితులు తమ వద్ద ఉన్న పెట్టుబడి రశీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఒప్పంద పత్రాలు, ఇతర ఆధారాలను పోలీసులకు అందించాలని తెలిపారు.ఆకర్షణీయమైన పథకాలు, అధిక లాభాల హామీలను నమ్మి పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు. ఈ కేసులో బాధితుల వివరాలను సేకరించడంతో పాటు, నిందితులతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్ఐ డి. రాధిక, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


